Total Pageviews

Monday, 17 October 2011

శక్తి పీఠాలు అంటే ఏమిటి ?-----నవరాత్రి ప్రత్యేక వ్యాసం

 శక్తి పీఠాల గురించిన కథ . తండ్రి పిలవక పోయినా పుట్టింటిపై ప్రేమతో దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వేళ్ళిన సతీ దేవికి అక్కడ అడుగడుగునా తిరస్కారం లభిస్తుంది. అంతే కాక భగవంతుడైన శివుని కూడా దక్షుడు దుర్భాషలాడుతాడు. తనకు కలిగిన తిరస్కారాలను సహించగలిగినా శివ నిందను వినలేని సతీ దేవి అక్కడికక్కడే యోగాగ్నిలో దగ్ధమవుతుంది. ఈ విషయం తెలిసిన శివుడు వీరభద్రుడు, ప్రమథ గణాలను పంపి దక్ష యజ్ఞం ధ్వంసం గావిస్తాడు. సతీ విరహాతురుడై యోగాగ్నిలో దగ్ధం కాగా మిగిలిన చిత్కళా శరీరాన్ని భుజంపై వేసుకొని లోకమంతా పరిభ్రమించడం మొదలు పెడతాడు. శివుని ఈ ఉన్మత్త స్థితిని చూసిన లోకం భయభ్రాంతమై శ్రీ మహా విష్ణువు ను శరణు కోరగా ఆయన రహస్యంగా శివుని వెంబడిస్తూ తన సుదర్శన చక్రంతో సతీ దేహ భాగాలను అక్కడక్కడా ఖండిస్తూ శక్తి పీఠాలను నెలకొల్పుతాడు.
సతీదేవి శక్తి స్వరూపిణి. శివుడు మోక్ష స్వరూపుడు. శివాపరాధం జరిగిన చోట అంటే మోక్షచింతన కొరవడిన చోట శక్తి నిలవదు. దక్ష యజ్ఞానికి లోకంలో గల సమస్త ప్రజానీకమూ వచ్చారు. అంటే ఎవరికీ మోక్ష జిజ్ఞాస లేదు. అదే ఆమె యోగాగ్నిలో దగ్ధం అవడం. అయితే ఆది గురువైన శివునికి ఇది అత్యంత ప్రమాదకరంగా తోచింది. శక్తి దూరమైతే కలిగే విపత్తులేమిటో తెలిసినవాడు కనుక పూర్తిగా అంతరించక ముందే శక్తిని ఉద్ధరించే ప్రయత్నం మొదలు పెట్టాడు. అనంత శక్తిని తలకెత్తుకున్న శివుడు ఉన్మత్తుడవగా ఉత్తమ శాక్తేయ ఉపాసకుడైన విష్ణుమూర్తి లోకోపకారం కోసం జగన్మాతను అక్కడక్కడా సృష్టిలోని ఉత్తమ స్థానాలలో శక్తిపీఠాలుగా నెలకొల్పాడు. అందుకే శక్తి పీఠాలు ఇన్ని అని ఇతిమిత్థంగా చెప్పలేకపోవడం. గురువులు వారి వారి సంప్రదాయాల ప్రకారం ఉపాసకులకు వివిధ అంతరార్ధాలతో వివిధ శక్తిపీఠాల గురించి తెలియచేస్తూ వచ్చారు. ప్రతీ పట్టికకూ ప్రత్యేక ధ్యానమూ, పూజా విధానమూ ఉన్నాయి.
 ఆది శంకరాచార్యులు తన అష్ఠాదశ శక్తిపీఠ స్తోత్రం లో ప్రస్తావించిన శక్తిపీఠాలు నాలుగు. శ్రీశైల భ్రమరాంబిక, అలంపురం జోగుళాంబ, పిఠాపురం పురుహూతిక, ద్రాక్షారామం మాణిక్యాంబ. వీరిలో,

శ్రీశైల భ్రమరాంబిక అష్ఠాదశ శక్తిపీఠాలలో మాత్రమే కాకుండా పంచాశత్ శక్తిపీఠాల జాబితాలోనూ, అష్టోత్తర శత శక్తిపీఠాల జాబితాలోనూ కూడా చెప్పబడింది. భ్రమరాంబిక జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునుని శక్తి. అరుణాసురుని దుశ్చర్యల వలన బాధలు పడుతున్న లోకాన్ని రక్షించడానికి జగన్మాత వేద స్వరూపిణి అయిన గాయత్రియే తన షడంగాలను షట్పాదాలుగా చేసుకొని భ్రామరీ రూపంలో అవతరించిందని దేవీభాగవతం తెలియచేస్తుంది.

అలంపురం జోగుళాంబ: పరశురాముని తల్లిదండ్రులైన రేణుకా జమదగ్నులచే ఆరాధించబడిన అమ్మవారు. బాల మ్రహ్మేశ్వరుని శక్తి. ఈమెను ఉపాసించి అనేక మంది యోగులు మట్టిని సైతం బంగారంగా మార్చడంతో ఈ ఊరికి హేమలాపురమనీ, అమ్మవారికి యోగుల అంబ అనీ పేర్లు వచ్చాయి.

పిఠాపురం పురుహూతిక: దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ గురుదేవుల జన్మస్థానం కూడా అయిన పీఠికాపురానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఊరు పాద గయ. అమ్మవారు పురుహూతిక. ఇంద్రారాధిత. శివుడు కుక్కుటేశ్వరుడు. ఇంకా శివ మందిరంలో హుంకృతి దుర్గ, ఊరిలో పంచ మాధవులలో ఒకడైన కుంతి మాధవుడు కూడా ఉన్నారు.

ద్రాక్షారామం మాణిక్యాంబ: ద్రాక్షారామం పంచారామాలలో ఒకటి. శివుడు సూర్య ప్రతిష్ఠితుడైన భీమేశ్వర స్వామి. అమ్మవారిని వేశ్యల కులదైవంగా కూడా చెబుతారు.

వీళ్ళే కాక బ్రహ్మాండ పురాణం విజయవాడ కనక దుర్గమ్మను, ఉప స్కాంద పురాణం త్రిపురాంతకంలో కొలువైన బాలా త్రిపుర సుందరిని, శివ చరితం కర్నూలు జిల్లా నందవరం గ్రామంలో గల చౌడేశ్వరీ అమ్మవారినీ కూడా శక్తిపీఠాలుగా వర్ణిస్తాయి.
 శక్తిపీఠమనే పదానికి దేవీ భాగవతం ఇచ్చిన తాత్వికార్ధాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే శ్రీశైల జ్యోతిర్లింగమూ, పంచారామాలూ, సింహాచలం యాదగిరిగుట్ట వంటి నారసింహ స్థానాలూ, శ్రీ వేంకటేశ్వరుని నిలయమైన తిరుమల, పద్మావతీ అమ్మవారి అలిమేలు మంగాపురం, మొదలైన క్షేత్రాలన్నీ శక్తి పీఠాల కిందే పరిగణనలోకి వస్తాయి. అంతే కాదు. కృష్ణా, గోదావరి వంటి నదులూ, అన్నమయ్య వంటి భక్తులూ, వేమన వంటి జ్ఞానులూ, బ్రహ్మంగారి వంటి యోగులూ, పోతన భాగవతం వంటి గ్రంధాలూ తెలుగునాట వెలసిన శక్తి పీఠాలే.

యోగనృసింహ క్షేత్రం ధర్మపురి

ధర్మపురి తెలంగాణాలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం, తీర్థరాజం. శ్రీ లక్ష్మీనృసింహుడు యోగనారసింహుడిగా, ఉగ్ర నారసింహుడిగా రెండు అవతారాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఉత్తర తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరాన ఈ క్షేత్రరాజం కలదు. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించుచు తన పవిత్రతను చాటుకొనుచున్నది. ఎంతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలంనుంచి వైదిక విద్యలకు, జ్యోతిశ్శాస్త్రానికి ప్రముఖస్థలముగా పేరొంది నేటికీ సాంప్రదాయ వేదవిద్యలకు నెలవైయున్నది.


ధర్మపురి క్షేత్రం సుమారు ఒక వేయి సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగియున్నది. ఈ క్షేత్రములో లక్ష్మీ నృసింహుడితో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ రామాలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ సంతోషిమాత ఆలయం వంటి అనేక దేవాలయములు కలిగి దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది.


పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపమాచరించగా, నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడుగా ఈ క్షేత్రమందు అవతరించెను. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధము. కుజదోషమున్న వారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణము చేయించిన వారి కుజదోష నివారణము జరిగి శీఘ్రంగా వివాహమవటం ఇక్కడి క్షేత్ర మహాత్మ్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారక్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యల పాలవటం కద్దు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి, స్వామివారిని అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.



గంపలవాడ

గంపలవాడ ధర్మపురిలోని ఒక వాడ, ఈ వాడ దేవాలయ సమూహానికి దగ్గరగా ఉండును. గంపలవాడకు ఈ పేరెలా వచ్చిందంటే 1970వ దశకంలో తెనుగు వారు (పళ్ళు అమ్మేవారు) ఇక్కడ ఎక్కువగా నివసించేవారు, వీరు గంపలలో పండ్లను తీసుకెళ్ళేవారు, గంప అనగా వెదురుతో చేసిన బుట్ట. మరియు కుమ్మరి వాళ్ళు కూడ మట్టి పాత్రలను ఇదే విధంగా తీసుకెళ్ళేవారు. అందుకనే గంపలవాడ అనే పేరు వచ్చింది. గంపలవాడను అంతకముందు మఠంగడ్డ అనేవారు. ఎందుకంటే పూర్వము ఋషులు, మునులు, ఈగడ్డ పైననే తపస్సు, పూజలు, చేసారని ప్రతీతి. ఇప్పటికి అదే కోవలో శ్రీశ్రీశ్రీ సచ్ఛిదానంద సరస్వతి స్వామివారు మఠంగడ్డ పరిసర ప్రాంతంలోనే శ్రీ మఠం స్తాపించారు, గంపలవాడలో ముఖ్యంగా చీర్ల వంశీయులు నివసిస్తున్నారు.

dharma

ధర్మపురి క్షేత్రం లోని గోదావరి తీరాన బ్రహ్మకుండం, బ్రహ్మ పుష్కరిణి వంటి కుండా లున్నాయి. అవే గాకుండా సత్యవతీ కుండం, యమకుండం, చింతామణి సరోవరం, వరా హతీర్థం, రాజతీర్థమనే కుండాలున్నాయి. వీటిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని చెబు తారు. ధర్మపురి ఈశాన్యభా గంలో గౌతమ మహర్షి తపస్సు చేసి శివలింగ ప్రతిష్ట చేశాడట. ఈ ఆలయం ప్రస్తుతం గౌతమేశ్వ రాలయంగా ప్రసిద్ధి చెందింది. భద్రానది గోదా వరిలో సంగమం చెందుతున్న చోట, రమణీ య ప్రకృతి సోయగాల మధ్య విరాజిల్లుతున్న ఆలయద్వారబంధంపై పద్మాస్థితయైన లక్ష్మీ దేవిని రెండుపక్కలా ఏనుగులు అభి షేకిస్తున్న శిల్పం ఇప్పటికీ చెక్కు చెద రకుండా ఉంది.

ఇక్కడ దత్తాత్రేయ మహర్షి ఆశ్ర మం స్థాపించి విదర్భ రాజుకు జ్ఞాన బోధ చేశాడట. ఈ ఆశ్రమ ప్రాంతం లోనే బలవర్మ రాజు కుమారుడైన ధ ర్మవర్మ తపస్సు చేసి నరసింహస్వా మిని సేవించి, తన పేరున ఊరిని ధర్మపురిగా మార్చాడని చెబుతారు. ధర్మపురి క్షేత్రంలో ఆలయాంతర్భాగంలో రెండు నృసింహ మందిరాలున్నాయి. ఒక ఆర్చామూర్తి శిలామూర్తిగా శ్రీలక్ష్మీనరసింహస్వామి యోగనరసింహస్వా మి (పాత నరసింహస్వామి) ప్రధాన ఆలయం కాగా, వేరొక మూర్తి దారు (కట్టె)తో చేయబడి న మూర్తి. మహ్మదీయుల దండయాత్రల సమ యంలో శిలావిగ్రహాన్ని దాచి కట్టె విగ్రహాన్ని ప్రతిష్టించినట్లుగా చెబుతారు. ఇక్కడ శ్రీవేం టేశ్వర స్వామి, శ్రీరామలింగేశ్వర స్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాలు ఉపా లయాలుగా ఉన్నాయి.

dharmapuri1బ్రహ్మ తపస్సు ఫలితంగా స్వామి ఇక్కడ నివసిస్తున్నాడనేందుకు ప్రతీకగా పాత నరసిం హస్వామి ఆలయంలోని ముఖమండపంలో బ్రహ్మదేవుడి విగ్రహం ప్రతిష్టించబడింది. య ముడు కూడా ఇక్కడి పుష్కరిణిలో స్నానమాడి న తరువాత పాపాల నుంచి విముక్తుడయ్యా డని తెలిపేందుకు పాత నరసింహస్వామి ఆల య ప్రవేశద్వారం వద్ద యముని విగ్రహం కూడా ప్రతిష్టించబడింది.ధర్మపురి లక్ష్మీనరసింహ ఆలయంలో స్వా మి వారికి ఏటా ఫాల్గున శుద్ధ ఏకాదశి మొద లు బహుళ షష్ఠి వరకు 13 రోజులు బ్రహ్మో త్సవాలు ఘనంగా జరుగుతాయి.

రైలు మార్గంలో వచ్చే వారు హైదరాబాద్‌- చెనై్న-ఢిల్లీ మార్గంలో మంచిర్యాల రైల్వేస్టేషన్‌ లో దిగి రోడ్డు మార్గంలో ధర్మపురి చేరుకోవ చ్చు. రోడ్డు మార్గంలో వచ్చే వారు మొదట (హైదరాబాద్‌ నుంచి) కరీంనగర్‌ చేరుకొని, అక్కడి నుంచి జగిత్యాల, అక్కడి నుంచి ధర్మపురి చేరుకోవచ్చు.

Wednesday, 12 October 2011

కడప నట్టింట ఒంటిమిట్ట-

ఒంటిమిట్ట,




ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లాకు చెందిన ఒక మండలము.కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 20 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ది చెందినది. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధము ఉంది సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడినది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శాతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.


ఒక మిట్ట పైన ఈ రామాలయం నిర్మించబడింది. అందుకని ఒంటిమిట్ట అని ఈ రామాలయానికి, గ్రామానికి పేరు వచ్చింది. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకుని నిజాయితీ గా బ్రతికారని, వారి పేరు మీదుగానే ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని ఇంకొక కథనం కూడ ఉంది. [1]మిట్టను సంస్కృతంలో శైలమంటారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశైలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే.








రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం. [




ఈ కోదండ రామాలయానికి మూడు గోపురద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (1863 - 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు [1]. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకట కవి, వర కవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.


చోళ, విజయనగర వాస్తుశైలులు కనిపించే ఈ ఆలయ స్థంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. చరిత్ర మధ్యయుగాల్లో మన దేశాన్ని దర్శించిన ప్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ తాను చూసిన గొప్ప ఆలయాల్లో ఇది ఒకటిగా అభివర్ణించాడు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపైన ”శ్రీ రఘువీర శతకాన్ని” రచించాడు. ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు. ఇక తెలుగు వారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ, సరళ కవి బమ్మెర పోతన, జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ, ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం కోదండరాముడికే. ఈ సహజకవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీప వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి.


ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధి తో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించికుని, ఎందరూ ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇక్కడి విశేషం. పుట్టపర్తి కి వచ్చే ఎంతో మంది విదేశీయులు కూడా ఈ ఆలయ సందర్శన కోసం ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఆలయ శిల్ప సంపద చూసి ముచ్చటపడిపోతుంటారు. [1]

ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. 2002 బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Wednesday, 5 October 2011

ఇంద్రకీలాద్రి పర్వతం-కనకదుర్గ గుడి విజయవాడ

ఇంద్రకీలాద్రి పర్వతం విజయవాడ నగరము లో ఉంది. ఈ పర్వతము మీద అర్జునుడు శివుని కొరకు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపదించాడని ప్రతీతి. ఇక్కడే అర్జునుడు శివపార్వతులతో యుధ్దం చేసాడని కూడా చెబుతారు. ఆ స్థలం లోనె కనకదుర్గ ఆలయం వెలసిందని అంటారు.
స్ధానికంగా వాడుక లో ఉన్న కధనం ప్రకారం, అసలు ఆలయం కొండ మీద ఉందని, సామాన్య మానవులకు కనిపించదని, ఇప్పుడు వున్న ఆలయం మానవుల కోసం నిర్మించబడిందని అంటారు



కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం లో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరం లో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. [1]ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలం తో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమ లో ఉంటుంది.
విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఆంధ్రప్రదేశ్ లో వేంకటేశ్వరస్వామి గుడి తర్వాత అత్యంత జనాకర్షణ కలిగిన గుడి. బ్రహ్మాండపురాణంలో కనకదుర్గమ్మను శక్తిపీఠంగా వర్ణించారు.

Image

అమ్మవారి గుడి కొండ మధ్యలో ఉంది. అమ్మవారి గుడి చుట్టూ ఇళ్ళు ఉన్నాయి. దుర్గాదేవి గుడి బంగారు శిఖరంతో అత్యంత శోభాయమానంగా ఉంటుంది. గర్భగుడి ప్రవేశద్వారంపైన ఒక చక్కటి శ్లోకం వ్రాసి ఉంటుంది.

అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.


ఇతర ప్రదేశాలు:

భవానీ మంటపం:

బస్ దిగిన వెంటనే మనకు ఎడమ వైపు భవానీ మంటపం కనిపిస్తుంది. అక్కడ చాముండా, మహాకాళి మొదలైన ఉగ్రమైన అమ్మవారి రూపాలు కొండ మీద చెక్కబడి ఉన్నాయి. భవానీ మాల వేసుకున్న భక్తులు అక్కడ పూజలు చేస్తారు. ప్రతీరోజు అక్కడ ఉత్సవమూర్తులకు కుంకుమార్చన చేస్తారు. ఇదివరకు కాలంలో అక్కడ ఒక కోనేరు ఉండేది. దానిని దుర్గాకుండం అని పిలిచేవారు. బ్రహ్మాండపురాణంలో దాని మహత్మ్యం గురించి చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో దేవస్థానం వారు ఇప్పుడు ఒక బిల్డింగు కట్టేశారు.


అశ్వథ్థవృక్షం:

 అమ్మవారికి ఎదురుగా ఒక అశ్వథ్థవృక్షం ఉంది. దాని క్రింద ఆంజనేయ స్వామి [గుడికి క్షేత్రపాలకుడు] విగ్రహం ఉంది.

మల్లేశ్వరస్వామి : మల్లేశ్వరస్వామి గుడి మెట్లమార్గంలో నుండి వస్తుంటే మొదట కనిపిస్తుంది. మల్లేశ్వరస్వామి కనక దుర్గమ్మ భర్త.

విఘ్నేశ్వరుడు, నటరాజ స్వామి, శివకామ సుందరిల గుళ్ళు దుర్గాదేవి గుడికి మల్లేశ్వరస్వామి గుడికి మధ్యలో ఉన్నాయి. యీ మూడు గుళ్ళు ఒకే వరసలో ఉంటాయి.

నాగేంద్ర స్వామి: దుర్గాదేవి గుడి ప్రక్కన ఉన్న సుబ్రమణ్యేశ్వర స్వామి గుడిలో ఉన్నది. పెళ్ళైన స్త్రీలు సంతాన ప్రాప్తికోసం నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తారు.

లక్షకుంకుమార్చన స్థలం: ఇది అమ్మవారి ధ్వజస్థభం దగ్గర ఉంది.

నిత్యపూజా స్థానం: పూర్వకాలంలో యీ ప్రదేశంలో ఉన్న శ్రీచక్రం దగ్గర నిత్యపూజలు నిర్వహించేవారు. కాని ప్రస్తుతం రద్దీ పెరగటం వలన నిత్య పూజలను ప్రాకార మంటపం లోనికి మార్చారు.

కళ్యాణ మంటపం: పూర్వం యీ ప్రదేశంలో అమ్మవారి కళ్యాణం నిర్వహించేవారు. ప్రస్తుతం భవానీ మంటపంలో దుర్గాదేవి కళ్యాణం చేస్తున్నారు.

శంకరాచార్య మంటపం: ఇది మల్లేశ్వరస్వామి గుడి ప్రక్కన ఉంది. ఇందులో ఆదిశంకరాచార్య స్వామి విగ్రహం ఉంది.

చండీహోమ మందిరం: ఇది ఆదిశంకరాచార్య మంటపం ప్రక్కన ఉంది. ఇందులో ప్రతీరోజు చండీ హోమం చేస్తారు.

ఇంకా కనక దుర్గ గుడి ప్రాంగణంలో నవగ్రహాలయం, శాంతి కళ్యాణ వేదిక, గోపీకృష్ణుని విగ్రహం, నిత్యాన్నదాన భవనం, అద్దాల మంటపం ఉన్నాయి.

స్థలపురాణం:
కనక దుర్గమ్మకు సంబంధించి మూడు కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది ఇంద్రకీలుని కథ, రెండోది అర్జుని కథ, మూడోది మాధవవర్మ కథ.

ఇంద్రకీలుని కథ:

ఇంద్రకీలుడు జగన్మాత భక్తుడు. అతను చిరకాలం భక్తితో అమ్మవారిని ఆరాధించి దుర్గాదేవి దర్శనం పొందాడు. అమ్మవారు ఎల్లప్పుడు తన వద్దనే ఉండాలని వరంకోరుకున్నాడు. అప్పుడు అమ్మవారు తర్వాత జన్మలో నీవు కొండ రూపం ధరిస్తావని, ఆ కొండమీద తను మహాలక్ష్మి రూపంలో అవతరిస్తానని వరమిచ్చింది.

అర్జునుడు మరియు మల్లేశ్వరస్వామి:


పాండవమధ్యముడు అయిన అర్జునుడు అరణ్యవాస సమయంలో తన అన్న ధర్మరాజు ఆజ్ఞమీద ఇంద్రకీలాద్రి మీద ఇంద్రుని కొరకు తపస్సు చేసాడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై శివమంత్రం ఉపదేశించి, పాశుపతాస్త్రం కొరకు శివుని ఆరాధించమని చెప్తాడు. అలా అర్జునుడు తపస్సు చెస్తున్నప్పుడు, ఒకానొక రోజు అతి భయంకరమైన పెద్ద పంది ఒకటి వచ్చి తపస్సుకి భంగం కలిగించసాగింది. తపోభంగమైన అర్జునుడు దాన్ని వేటాడసాగాడు. కాని అది చాలా చురుకుగా బాణాలనుండి తప్పించుకొని పారిపోతుంది. ఎట్టకేలకు అర్జునుడు గురిచూసి దాని మీదకు బాణం వేసాడు. కాని దగ్గరకు వెళ్ళి చూస్తే దానికి రెండు బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. అంతలో ఒక కోయదొర వచ్చి ఆ పందిని తీసుకొని వెళ్ళసాగాడు. అప్పుడు అర్జునుడు ఆ పందిని నేను సంహరించాను కాబట్టి ఆ పంది నాది అని వాదించసాగాడు. దానికి ఆ కోయదొర నవ్వాడు. దానికి కోపం వచ్చిన అర్జునుడు అతనితో ఎవరు గొప్పో తేల్చుకుందామని యుద్ధానికి దిగాడు. అర్జునుడు ఎన్ని దివ్యాస్త్రాలు వేసినా కూడా ఆ కోయరాజుని ఏమీచేయలేక పోయాడు. తన దివ్యాస్త్రాలన్ని వృధాఅయిన కారణంగా అర్జునుడు తన విల్లు తీసుకొని ఆ కోయరాజు తలమీద కొట్టబోతాడు. అప్పుడు ఆ కోయరాజు మాయమై ఆ ప్రదేశంలో పరమశివుడు ప్రత్యక్షమై నవ్వుతూ కనిపిస్తాడు. పరమశివుని తో యుద్ధం చేసిన కారణానికి అర్జునుడు ఎంతో సిగ్గుపడి, బాధపడతాడు. తర్వాత శివుని స్తుతిస్తాడు. దానికి సంతసించిన శివుడు అర్జునికి పాశుపతాస్త్రం ఇచ్చి, దాన్ని అత్యవసర సందర్భాలలో, అరుదుగా మాత్రమే వాడాలి అని చెప్తాడు. తర్వాత శివుడు అర్జునికి నిగ్రహం సాధించమని చెప్పి అప్పుడు మాత్రమే అస్త్రాలు లోకకళ్యాణం కు ఉపయోగపడతాయి అని చెప్పి మాయమవుతాడు. అర్జునికి వరాలిచ్చిన మల్లేశ్వరస్వామి శక్తి కనక దుర్గ . ఇంద్రుడిచేత కీలితం చేయబడ్డాడు కాబట్టి అర్జునికి ఇంద్రకీలుడు అని కూడా పేరు వచ్చింది. అర్జునికి ఉన్న విజయనామం వల్ల యీ ప్రాంతానికి విజయపురి, విజయవాటిక, విజయవాడ, బెజవాడ, బెజ్జువాడ అని పేర్లు వచ్చాయని చెప్తారు.

మాధవవర్మ కథ:


పూర్వం విజయవాడను మాధవవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతను అతి జాగ్రత్తతో ప్రజలను కన్నబిడ్డలకంటే ఎక్కువగా చూసుకొనేవాడు. అతను నిత్యం మల్లేశ్వరస్వామిని పూజ చేసేవాడు. ఒకానొక రోజు అతని కుమారుడు రధం మీద విజయవాడ పురవీధులలో తిరుగుతున్నాడు. కానీ అనుకోకుండా ఒక చిన్నపిల్లవాడు అతివేగంగా వెళ్తున్న ఆ రధచక్రాల క్రింద పడి మరణిస్తాడు. ఆ పిల్లవాడు ఆ రాజ్యంలో నివసిస్తున్న ఒక పేద బిచ్చగత్తె ఒక్కగానొక్క కుమారుడు. ఆమె వెళ్ళి మాధవవర్మకు అతని కుమారుని కారణంగా తన బిడ్డ చనిపోయాడు అని ఫిర్యాదు చేస్తుంది. మాధవవర్మ తన జీవితంలో ఎప్పుడూ తప్పుడు తీర్పులు చెప్పలేదు. అతనికి ప్రస్తుత పరిస్థితి పరీక్షలాగా మారింది. అతను వెంటనే భవిష్యత్తు రాజు అయిన తన కుమారుడికి మరణ శిక్షవేసి అమలు పరిచాడు. అతని తీర్పుకి సంతసించిన దుర్గాదేవి కనక వర్షం కురిపించింది. కాబట్టి ఆమెకు కనకదుర్గ అని పేరు వచ్చింది. మల్లేశ్వరస్వామి ఇద్దరి బిడ్డలకు తిరిగి బ్రతికిస్తాడు.
కనక దుర్గమ్మ గుడికి ఎలా వెళ్ళాలి?
ఆంధ్రప్రదేశ్ > కృష్ణాజిల్లా > విజయవాడ
విజయవాడలో కృష్ణానది ప్రక్కన ఇంద్రకీలాద్రి అనే చిన్న కొండ మీద అమ్మవారి గుడి ఉంది. విజయవాడ బస్ స్టాండ్ నుండి, రైల్వేస్టేషను నుండి కనక దుర్గమ్మగుడి వద్దకు వెళ్ళటానికి దేవస్థానం వారు ఉచిత బస్ సర్వీసులు నడుపుతున్నారు. కొండ మీదకు ఘాట్ రోడ్డు కలదు. ఆటోలు, టాక్సీలు కూడా కొండ మీదకు వెళ్తాయి. కొండ మీదకు వెళ్ళటానికి మెట్లమార్గం కూడా ఉంది.
దగ్గరలోని ఎయిర్ పోర్టు: గన్నవరం, విజయవాడకు 30కి.మి దూరంలో ఉంది.