Total Pageviews

Monday 17 October 2011

శక్తి పీఠాలు అంటే ఏమిటి ?-----నవరాత్రి ప్రత్యేక వ్యాసం

 శక్తి పీఠాల గురించిన కథ . తండ్రి పిలవక పోయినా పుట్టింటిపై ప్రేమతో దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వేళ్ళిన సతీ దేవికి అక్కడ అడుగడుగునా తిరస్కారం లభిస్తుంది. అంతే కాక భగవంతుడైన శివుని కూడా దక్షుడు దుర్భాషలాడుతాడు. తనకు కలిగిన తిరస్కారాలను సహించగలిగినా శివ నిందను వినలేని సతీ దేవి అక్కడికక్కడే యోగాగ్నిలో దగ్ధమవుతుంది. ఈ విషయం తెలిసిన శివుడు వీరభద్రుడు, ప్రమథ గణాలను పంపి దక్ష యజ్ఞం ధ్వంసం గావిస్తాడు. సతీ విరహాతురుడై యోగాగ్నిలో దగ్ధం కాగా మిగిలిన చిత్కళా శరీరాన్ని భుజంపై వేసుకొని లోకమంతా పరిభ్రమించడం మొదలు పెడతాడు. శివుని ఈ ఉన్మత్త స్థితిని చూసిన లోకం భయభ్రాంతమై శ్రీ మహా విష్ణువు ను శరణు కోరగా ఆయన రహస్యంగా శివుని వెంబడిస్తూ తన సుదర్శన చక్రంతో సతీ దేహ భాగాలను అక్కడక్కడా ఖండిస్తూ శక్తి పీఠాలను నెలకొల్పుతాడు.
సతీదేవి శక్తి స్వరూపిణి. శివుడు మోక్ష స్వరూపుడు. శివాపరాధం జరిగిన చోట అంటే మోక్షచింతన కొరవడిన చోట శక్తి నిలవదు. దక్ష యజ్ఞానికి లోకంలో గల సమస్త ప్రజానీకమూ వచ్చారు. అంటే ఎవరికీ మోక్ష జిజ్ఞాస లేదు. అదే ఆమె యోగాగ్నిలో దగ్ధం అవడం. అయితే ఆది గురువైన శివునికి ఇది అత్యంత ప్రమాదకరంగా తోచింది. శక్తి దూరమైతే కలిగే విపత్తులేమిటో తెలిసినవాడు కనుక పూర్తిగా అంతరించక ముందే శక్తిని ఉద్ధరించే ప్రయత్నం మొదలు పెట్టాడు. అనంత శక్తిని తలకెత్తుకున్న శివుడు ఉన్మత్తుడవగా ఉత్తమ శాక్తేయ ఉపాసకుడైన విష్ణుమూర్తి లోకోపకారం కోసం జగన్మాతను అక్కడక్కడా సృష్టిలోని ఉత్తమ స్థానాలలో శక్తిపీఠాలుగా నెలకొల్పాడు. అందుకే శక్తి పీఠాలు ఇన్ని అని ఇతిమిత్థంగా చెప్పలేకపోవడం. గురువులు వారి వారి సంప్రదాయాల ప్రకారం ఉపాసకులకు వివిధ అంతరార్ధాలతో వివిధ శక్తిపీఠాల గురించి తెలియచేస్తూ వచ్చారు. ప్రతీ పట్టికకూ ప్రత్యేక ధ్యానమూ, పూజా విధానమూ ఉన్నాయి.
 ఆది శంకరాచార్యులు తన అష్ఠాదశ శక్తిపీఠ స్తోత్రం లో ప్రస్తావించిన శక్తిపీఠాలు నాలుగు. శ్రీశైల భ్రమరాంబిక, అలంపురం జోగుళాంబ, పిఠాపురం పురుహూతిక, ద్రాక్షారామం మాణిక్యాంబ. వీరిలో,

శ్రీశైల భ్రమరాంబిక అష్ఠాదశ శక్తిపీఠాలలో మాత్రమే కాకుండా పంచాశత్ శక్తిపీఠాల జాబితాలోనూ, అష్టోత్తర శత శక్తిపీఠాల జాబితాలోనూ కూడా చెప్పబడింది. భ్రమరాంబిక జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునుని శక్తి. అరుణాసురుని దుశ్చర్యల వలన బాధలు పడుతున్న లోకాన్ని రక్షించడానికి జగన్మాత వేద స్వరూపిణి అయిన గాయత్రియే తన షడంగాలను షట్పాదాలుగా చేసుకొని భ్రామరీ రూపంలో అవతరించిందని దేవీభాగవతం తెలియచేస్తుంది.

అలంపురం జోగుళాంబ: పరశురాముని తల్లిదండ్రులైన రేణుకా జమదగ్నులచే ఆరాధించబడిన అమ్మవారు. బాల మ్రహ్మేశ్వరుని శక్తి. ఈమెను ఉపాసించి అనేక మంది యోగులు మట్టిని సైతం బంగారంగా మార్చడంతో ఈ ఊరికి హేమలాపురమనీ, అమ్మవారికి యోగుల అంబ అనీ పేర్లు వచ్చాయి.

పిఠాపురం పురుహూతిక: దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ గురుదేవుల జన్మస్థానం కూడా అయిన పీఠికాపురానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఊరు పాద గయ. అమ్మవారు పురుహూతిక. ఇంద్రారాధిత. శివుడు కుక్కుటేశ్వరుడు. ఇంకా శివ మందిరంలో హుంకృతి దుర్గ, ఊరిలో పంచ మాధవులలో ఒకడైన కుంతి మాధవుడు కూడా ఉన్నారు.

ద్రాక్షారామం మాణిక్యాంబ: ద్రాక్షారామం పంచారామాలలో ఒకటి. శివుడు సూర్య ప్రతిష్ఠితుడైన భీమేశ్వర స్వామి. అమ్మవారిని వేశ్యల కులదైవంగా కూడా చెబుతారు.

వీళ్ళే కాక బ్రహ్మాండ పురాణం విజయవాడ కనక దుర్గమ్మను, ఉప స్కాంద పురాణం త్రిపురాంతకంలో కొలువైన బాలా త్రిపుర సుందరిని, శివ చరితం కర్నూలు జిల్లా నందవరం గ్రామంలో గల చౌడేశ్వరీ అమ్మవారినీ కూడా శక్తిపీఠాలుగా వర్ణిస్తాయి.
 శక్తిపీఠమనే పదానికి దేవీ భాగవతం ఇచ్చిన తాత్వికార్ధాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే శ్రీశైల జ్యోతిర్లింగమూ, పంచారామాలూ, సింహాచలం యాదగిరిగుట్ట వంటి నారసింహ స్థానాలూ, శ్రీ వేంకటేశ్వరుని నిలయమైన తిరుమల, పద్మావతీ అమ్మవారి అలిమేలు మంగాపురం, మొదలైన క్షేత్రాలన్నీ శక్తి పీఠాల కిందే పరిగణనలోకి వస్తాయి. అంతే కాదు. కృష్ణా, గోదావరి వంటి నదులూ, అన్నమయ్య వంటి భక్తులూ, వేమన వంటి జ్ఞానులూ, బ్రహ్మంగారి వంటి యోగులూ, పోతన భాగవతం వంటి గ్రంధాలూ తెలుగునాట వెలసిన శక్తి పీఠాలే.

No comments:

Post a Comment