ఈ ఆలయంలోని విగ్రహం, కుమారస్వామి నెమలి సింహాసనం మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న చిన్న బాలుడి రూపంలో ఉంటుంది. కనుకనే ఈ స్వామిని బాల సుబ్రహ్మణ్యం అని ఉదహరిస్తుంటారు. కుమార స్వామి ఎడుంబన్‌ను ఒక దండంతో చంపాడు గనుక ఆయనకు దండాయుధపాణి అని కూడా పేరు.
కుమారస్వామి ఆరు అంశలకు సంబంధించి ఆరు దేవాలయాలలోనూ పళని దేవాలయమే ప్రధానమైందని సుబ్రహ్మణ్యేశ్వరుని భక్తుల విశ్వాసం. కుమార స్వామి దేవాలయాలలోనే గాకుండా, తమిళనాడులోని దేవాలయాన్నింటిలోనూ భాగ్యవంతమైన ఆలయాల్లో ఈ పళని దేవాలయం ప్రముఖమైంది.
పళని దేవాలయం ఒక కొండ మీద ఉంది. పైకి ఎక్కడానికి మెట్ల దారి ఉంది. మెట్ల దారిని అనుకునే చదునైన రోడ్డు దారి కూడా ఉంది. మెట్ల దారికి కొంత దూరంలో రోప్ వే సదుపాయం కూడా ఉంది.
ఆలయం సుమారు 450 అడుగుల ఎత్తున ఉన్న కొండమీద ఉంది. ఈ కొండను ఎడుంబన్ కొండ అంటారు. ఒకానొకప్పుడు అగస్త్యుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఎందుకో రెండు కొండలను సృష్టించాడు. అందులో ఒక కొండ పేరు పగిరి. అగస్త్యుడు తన శిష్యులలో ఒకడైన ఎడుంబన్ అనే రాక్షసుడిని పిలిచి ఆ రెండు కొండలను ఒక కావడిలో చెరో పక్కన ఉంచి తన వెనుకే మోసుకురమ్మని చెప్పి కొంత దూరం పోయాక, తను బ్రహ్మలోకం పోయాడట.
కావడి మోసుకుంటూ వెళ్తూ ఉన్న ఎడుంబన్ కొంత దూరం పోయిన తరువాత, కావడి లోని ఒకవైపు కిందకు వంగిపోయి, బరువుగా ఉన్నట్లు అన్పించగా, కావడి కిందకు దించి చూశాడట. కావడిలో శివగిరి ఉన్నవైపు కిందకు దిగి ఉందట. ఆ కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక చిన్న బాలుడి ఆకారంలో కూర్చొని ఉన్నాడట. అతనిని దిగిపొమ్మని ఎడుంబన్ గద్దించాడు. వెంటనే స్వామి ఒక గదతో ఎడుంబన్‌ను కొట్టి చంపేశాడు.
ఇంతలో అక్కడికి తిరిగి వచ్చిన అగస్త్యుడు విషయం తెలుసుకొని శాంతించాల్సిందిగా స్వామిని ప్రార్థించాడు. అంతట స్వామి శాంతించి ఎడుంబన్‌ను తిరిగి బ్రతికించడమే గాకుండా, ఇక ముందు ఆ రెండవ కొండ మీదే ఉంటానని, తనను దర్శించడానికి వచ్చే వారు ముందుగా ఎడుంబన్ దర్శనం చేసుకున్న తరువాతనే తనను దర్శిస్తారని వరం ఇచ్చాడట. పళనిలో కొండమీదకు వెళ్ళే మార్గం పక్కనే ఈ ఎడుంబన్ విగ్రహం ఉన్న మందిరం లాంటి ఆలయం ఉంది. దాన్ని ఎడుంబన్ కొండ అని అంటారు.
కుమార స్వామి మొదట శివగిరి కొండ మీదకు చేరడానికి ఒక ఇతిహాసం ఉంది. ఒకసారి బ్రహ్మదేవుడు పరమేశ్వరుడి దర్శనార్థం కైలాసం వచ్చాడు. ఆయన చేతిలో ఒక పండు ఉంది. అతి అపురూపమైన బ్రహ్మజ్ఞానంతో నిండిన ఫలం అని చెప్పి పరమశివుడి చేతిలో పెట్టాడట. ఆ సమయానికి అక్కడే ఉన్న ఇద్దరు పుత్రులలో ఎవరికి ఆ ఫలం ఇవ్వాలో అర్థం గాక, ఈ సమస్త విశ్వాన్ని ప్రదక్షిణం చేసి ముందుగా వచ్చిన వారికి ఆ ఫలం ఇస్తానని చెప్పాడట. కుమార స్వామి వెంటనే తన నెమలి వాహనంఎక్కి బయలుదేరాడు. తన మరుగుజ్జు రూపంతో వేగంగా ప్రయాణించలేని వినాయకుడు తన తండ్రి చుట్టూ ప్రదక్షిణం చేసి, సమస్త విశ్వమూ పరమేశ్వరుడి ప్రతిరూపమే గనుక, తను విశ్వ ప్రదక్షిణం చేసి వచ్చినట్లేనని అన్నాడట.
అతని మాటలకు మెచ్చి ఆ ఫలం వినాయకుడికి ఇవ్వగా, ఆయన దానిని తినివేశాడట. కొంతసేపటికి విశ్వప్రదక్షిణం పూర్తి చేసుకుని వచ్చిన కుమారస్వామి జరిగిన విషయం తెలుసుకొని, కోపంతో ఒక మూలకు పోయి కూర్చున్నాడట. అప్పుడు పరమేశ్వరుడు కుమారుడిని బుజ్జగించి, సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానం మొత్తమూ నీలోనే ఇమిడి ఉంది. కనుక నీకు జ్ఞానం చేకూర్చే మరో ఫలం ఎందుకు అని సర్ది చెప్పాడట. అతా పరమేశ్వరుడు కుమారునితో ‘బ్రహ్మజ్ఞాన ఫలానివి సాక్షాత్తూ నీవే’ అన్న మాటలను క్లుప్తంగా, ఫలానివి నీవే అని ఉదహరించడంగా మారి, కాలక్రమేణా ‘పళని’ అయిందని అంటారు.
భక్తులు ఈ స్వామివారికి పాలతో అభిషేకం చేయడం సంప్రదాయంగా వస్తున్న పద్ధతి. అందువల్ల చుట్టపక్కల వారు ఇంటి నుంచే పాలు తెచ్చుకుంటారు. లేదంటే గుడి ఎక్కే మెట్ల మొదటనే ఉన్న దుకాణాల్లో పాలు అమ్ముతారు.
ఎలా వెళ్ళాలి...
దిండిగల్లు నుంచి కోయంబత్తూరు వరకు ఉన్న రైలు మార్గంలో మధ్యలో ఉంది పళని. రైలులో వెళ్ళితే దిండిగల్లు నుంచి 49 కి.మీ. సుమారు గంటన్నర ప్రయాణం
No comments:
Post a Comment