నేపాల్ వెళ్లినవారికి ఎప్పు డెప్పుడు వెళ్లి చూద్దామా అనిపించే ప్రాంతం పోఖారా. నేపాల్‌లోని అత్యంత పవిత్ర పర్వతం అన్నపూర్ణ పర్వతం. ఆ పర్వత ప్రాంతంలోనే ఉంది పోఖారా. ఇక్కడి మత్స్యపుత్స పర్వతం చూడటం ఒక వింతైన అనుభవం. చేపతోక రూపంలో ఆ శిఖరాలు కనిపిస్తాయి. వేకువ ఝామునే లేచి సూర్యోదయ కిరణాల వెలుగులో అన్నపూర్ణ పర్వత అందాలను తిలకించడం జీవితంలో మరువలేని అనుభవం.
సూర్యుని తొలికిరణాలకు వెలుగులు ప్రారంభించి, సమయంతో పెరిగే సూర్య కిరణాలకు తగిన రీతిలో వెలుగులను విరజిమ్మే ఆ శిఖరాలను దర్శించి అన్నపూర్ణ మాతకు నమస్కారం చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఆ ప్రదేశంలోని మిగిలిన ఆకర్షణలవైపు కళ్లు తిప్పగలం.ఇక్కడికి సమీపంలో ఉన్న ఫేవా సరస్సులో పడవల్లో విహరించ వచ్చు. ఎవరికివారు నడుపు కుంటూ వెళ్లేందుకు వీలున్న పడవలున్నాయి. పర్వతాల మధ్య ఉన్న ఆ సరస్సులో ప్రశాంత జలాలమీద నెమ్మదిగా సాగే పడవ ప్రయాణం ఎంతో బావుంటుంది. సూర్యోదయ సమయంలో అన్నపూర్ణ పర్వత సముదాయాన్ని తిలకించిన వారికి సూర్యాస్తమయ సమయంలో ఆ పర్వతాలు ఎలా కనిపిస్తాయో కదా అనే సందేహం కలుగుతుంది. ఆ మధురమైన అనుభవం కోసం శాంతి శిఖరం మీదికి వెళ్లి తీరాల్సిందే.
ప్రపంచశాంతి కోరుతూ నిర్మించిన ఈ శిఖరం ఒక పర్వతం అంచులో ఉంటుంది. అక్కడ నిలబడి పడమరగా తిలకిస్తుంటే సూర్యుడు ఎంతసేపటికీ కిందికి దిగుతున్నట్లుగా ఉండదు. ఈ అందమైన ప్రకృతిని పగలంతా కాంచినా తనివితీరని సూర్యుడు దిగాలుగా వెళ్లలేక వెళుతున్నాడా అనిపిస్తుంది. నెమ్మదిగా సూర్యుడు పశ్చిమానికి దిగుతుంటే పర్వత చాయలు లోయలంతా కప్పుతాయి. అంతవరకు ఒక వెలుగు వెలిగిన ఆ ప్రాంతమంతా హఠాత్తుగా మేఘాలు కమ్మినట్టయి చీకటిగా అవుతుంది. పక్షులు అరుపులు ఒక్కసారిగా ఆగిపోతాయి. ఆ మార్పును చూస్తూ పర్యాటకులు మౌనంలోకి వెళతారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది.
పోఖరాలో ఉన్న ఒక గుహ ప్రత్యేకమైనది. అది గుప్తేశ్వర మహాదేవుని నిలయం. దాదాపుగా 140 మీటర్ల పొడవున్న గుహ అది. ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆ గుహగుండా ప్రయాణం చేసి ఆవలకు చేరుకునేసరికి సరిగా ఎదురుగా పాల రంగులో పడుతున్న జలపాతం దర్శనమిస్తుంది. అది దేవీజలపాతం. హిమాలయాల నుండి జారిపడే అనేక జలపాతాలలో ఇది అందమైనది. సాహసకృత్యాలు చేయాలనుకునేవారికి పోఖారాన్ తగిన ప్రదేశం. ఇక్కడ అనేక రకాల సాహస క్రీడలు ఉన్నాయి. ఒకటి వేగంగా ప్రవహించే నది మధ్యలో రబ్బరు పడవ ప్రయాణం. దీనిని రివర్ రాఫ్టింగ్ అంటారు. సమీపంలోని తులసి నదిలో ఈ సౌకర్యం ఉంది. ఇది సాహసయాత్ర. రబ్బరు పడవను తెడ్డు వేసుకుంటూ, మునిగిపోకుండా నెట్టుకు రావడం సాహసం.
No comments:
Post a Comment