ఆంధ్రప్రదేశ్‌లో జలపాతాలకు కొదవలేదు. వివిధ జలపాతాలున్న ఈ ప్రదేశాలు కేవలం పర్యాటక ప్రాంతాలనే కాక శివక్షేత్రాలుగా కూడా విలసిల్లుతు న్నాయి. అలాంటి కోవలోనే చిత్తూరు జిల్లాలోని పుత్తూరు సమీపంలో ఉన్న కైలాసనాథ కోన జలపాతం గురించి చెప్పుకోవచ్చు.
చెన్నై, తిరుపతి మార్గంలో ఉన్న ఈ జలపాతం ప్రధాన రహదారి నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రధాన రహదారి నుంచి జలపాతం సమీపం వరకు రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యం ఉండడం ఈ ప్రదేశానికి సంబంధించిన విశేషం.వారంలోని అన్ని రోజులు ఈ ప్రదేశానికి పర్యటకుల తాకిడి ఉంటున్నా ప్రతి ఆదివారం పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. సరిహద్దు రాష్టమ్రైన తమిళనాడు రాజధాని చెన్నై సహా చుట్టుప్రక్కల ప్రదేశాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు.
జలపాతం విశేషాలు
చుట్టూ ఎత్తైన కొండలు, గలగలమని దుమికే జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ పైనుంచి జాలువారే జలపాతంలో రోజంతా తడవడం, దగ్గర్లోనే ఉన్న చిన్న గుహలో కైలాసనాథునిగా వెలసిన శివుని దర్శించుకోవడం పర్యటకులకు ఓ చక్కని అనుభూతిని మిగులుస్తుంది. వేంకటేశ్వరుని భార్య అయిన పద్మావతీ దేవి జన్మస్థలంగా పురాణాల్లో సైతం ఈ ప్రాంతం చోటు సంపాదించింది. అలాగే ఈ కోన నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుత్తూరు విరిగిన ఎముకలను సరిచేసే వైద్యానికి చాలా ప్రసిద్ధి.
రవాణా, వసతి సౌకర్యాలు
కైలాసనాథ కోన చేరడం చాలా సులభం. తిరుపతి నుంచి పుత్తూరు మీదుగా చెన్నై వెళ్లే మార్గంలో నారాయణవరం దాటిన తర్వాత దాదాపు పదికిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. పుత్తూరు నుంచి రోజులో దాదాపు నాలుగుసార్లు నేరుగా ఈ జలపాతం వద్దకు బస్సు సౌకర్యం ఉంది. అలాగే సొంత వాహనంలో వెళ్లేవారికి ఈ జలపాతం వద్దకు వెళ్లడం మరింత సౌకర్యం. ఈ జలపాతం ఉన్న ప్రదేశంలో ప్రస్తుతం ఓ టూరిస్ట్ గెస్ట్ హౌజ్ కూడా ఉంది. అయితే పర్యాటకులు సాయంత్రం సమయానికి జలపాతం ఉన్న ప్రాతం నుంచి తిరుగు ప్రయాణం అవుతుంటారు. అలాగే ఈ ప్రాతంలో ఆది వారం తప్ప మిగిలిన రోజుల్లో తినే పదార్ధాలేవీ లభించవు. పర్యాటకులు తమ తిండిని వెంట తీసుకువెళ్లడం తప్పనిసరి.
ఈ కైలాసనాథ కోన వెలసిన ప్రాంతానికి సమీపంలోనే అనేక పేరుపొందిన దేవాలయాలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తిరుమల క్షేత్రం ఈ కోన ఉన్న ప్రాంతం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే ఈ కోన ప్రాంతం నుంచి దాదాపు పదికిలోమీటర్ల దూరంలో నారాయణవరం అనే ఊరిలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది.
No comments:
Post a Comment