పెద్దగా పేరు లేకున్నా రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఎన్నో సుందర జలపాతాలున్నాయి. మిగిలిన జిల్లాల మాట అటుంచి ఒక్క చిత్తూరు జిల్లాలోనే జలపాతాలతో కూడిన ఎన్నో సుందర పర్వతప్రాంతాలు పర్యాటకుల కోసం సిద్ధంగా ఉన్నాయి. కొంచెం శ్రమ, కాస్త ఓపికను వెచ్చించగల్గితే ఈ సుందర ప్రదేశాలను దర్శించి ప్రకృతి ఒడిలో సేదతీరవచ్చు. ఇలా చెప్పుకుంటే చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ సుందర జలపాతం గురించి చెప్పవచ్చు. శ్రీకాళహస్తి-చెన్నై మార్గమధ్యంలోని మండల కేంద్రమైన వరదయ్యపాళెం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండలనడుమ ఉన్న ఈ జలపాతం పేరు ఉబ్బలమడుగు. ఈ జలపాతాన్నే తడ జలపాతం అని కూడా అంటారు. ఈ జలపాతాన్ని సందర్శించడానికి పలు మార్గాలు ఉన్నా వరదయ్యపాళెం మీదనుంచి మాత్రమే వాహనాలు వెళ్లగలిగే రోడ్డు సౌకర్యం ఉంది. అందుకే పర్యాటకులు ఈ మార్గాన్నే ఎంచుకుంటారు.
అయితే జలపాతాన్ని సందర్శించాలంటే మాత్రం గుట్టలమీదుగా దాదాపురెండు, మూడు కిలోమీటర్లు నడవాల్సిందే. ఈ దారిలో ప్రయాణం కాస్త శ్రమతో కూడుకున్నదే. ఎందుకంటే పెద్దవిగా ఉన్న ఈ బండలమీదకు గెంతుతూ వెళ్లాల్సి ఉంటుంది. ఇలా శ్రమకోర్చి కొండ సగభాగానికి చేరుకుంటే అక్కడ గలగల శబ్ధంతో జాలువారే సుందర జలపాతం మనకు దర్శనమిస్తుంది. ఈ జలపాతం కింద పర్యాటకులు తనివితీరా జలకాలాడవచ్చు. ఈ జలపాతానికి చేరుకునే మార్గంలో మరో రెండు చోట్ల చిన్న తటాకాలు ఉన్నాయి. వీటిలో కూడా పర్యాటకులు చక్కగా జలకాలాడవచ్చు. దట్టమైన అడవిగుండా సాగే ఈ మార్గంలో జట్టుగా ప్రయాణించడం ఓ మర్చిపోలేని అనుభూతి.
వసతిసౌకర్యాలు...
ఉబ్బలమడుగు పూర్తిగా అటవీప్రాంతం కాబట్టి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. కొండలపీఠ భాగం దగ్గర ఓ శివుని విగ్రహాం ఉంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఈ స్వామికి పూజలు చేస్తారు. పర్యాటకులకు ఏమి కావాలనుకున్నా వరదయ్యపాళెంలోనే తీసుకుని వెళ్లాల్సిందే. వరదయ్యపాళెం లోని ఆటోలులాంటి కొన్ని రకాల వాహనదారులు ఉబ్బలమడుగు వరకు రవాణా సౌకర్యం కల్పించేందుకు సిద్దంగా ఉంటారు.
అలాగే మరికొందరు పర్యాటకులు ద్విచక్ర వాహనాల్లో ఇక్కడకు చేరుకుంటారు. అయితే ఏ వాహనమైన కొండ పీఠభాగం వరకు మాత్రమే రాగలుగుతాయి.
రవాణా సౌకర్యాలు...
ముందే చెప్పుకున్నట్టు వరదయ్యపాళెం చేరుకుంటే అక్కడినుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల వరకు చక్కని తారు రోడ్డు, ఆపై మరో నాలుగు కిలోమీటర్లు మేర మట్టిరోడ్డు ఉంది. దాదాపు అన్ని రకాల వాహనాలు ఈ మార్గం గుండా కొండల పీఠభాగాన ఉండే సరస్సు వరకు సులభంగా చేరుకుంటాయి. వారాంతాల్లో ఈ ప్రదేశానికి చెప్పుకోదగ్గ సంఖ్యలోనే పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ ప్రదేశానికి బృందాలుగా వెళ్లడమే క్షేమకరం.
No comments:
Post a Comment