Total Pageviews

Monday 19 September 2011

శిల్పకళకు కాణాచి శుచీంద్రం

తలలూపుతూ స్వాగతం పలికే కొబ్బరి చెట్లు, ఊరిలోకి వెళ్తే పచ్చదనం మా సొంతమే అన్నట్లు పిల్లగాలికి మెల్లగా కదులుతూ హొయలు పోయే అరటి తోటలు ఇవన్నీ చూస్తూపరవశంతో ముందుకు కదులుతుంటే, పర్యటకుల సేదదీర్చడానికా అన్నట్లు విశాలమైన కోనేరు దర్శనమిస్తుంది. ఆలయం లోపలికి వెళ్తే కళ్లు చెదిరే శిల్పసంపద, సరిగమలు పలికే సంగీత స్తంభాలతో పర్యటకులను అలరించే ప్రదేశమే శుచీంద్రం.

సతీ అనసూయ పాతివ్రత్య మహిమ తో త్రిమూర్తులను పసిబిడ్డలుగా మార్చినట్లు, శాపవిమోచనం కోసం ఇంద్రుడు తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతున్న ప్రదేశం కూడా ఇదే. ప్రాచీన కాలం నుండి విశిష్టత సంతరించుకున్నది శుచీంద్రం. ఈ ఆలయంలో ఏటా ఏప్రిల్‌, డిసెంబర్‌ నెల ల్లో ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరవుతారు.
tempulమనదేశంలో మరెక్కడా కనిపించని అరుదైన దృశ్యాలు, ప్రకృతి ప్రసాదించిన వరాలు కన్యాకుమారి సొంతం. సూర్యోదయం నుండి అస్తమయంలోపుగా బంగాళాఖాతంలో మునిగి, హిందూ మహాసముద్రం అలలపై బోట్‌ షికార్‌ చేసి, అరేబియా సముద్రం నీళ్లు తలపై చల్లుకుని, సూర్యుడు ఉదయించడం, అస్తమించడం రెండూ చూస్తే కన్యాకుమారి వచ్చిన పని పూర్తయినట్లే.

ఉదయించిన సూర్యుడిని చూసి అస్తమయం దాకా కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్‌, బ్రిటిష్‌ కాలం నాటి చర్చ్‌ అన్నీ చూడవచ్చు.కన్యాకుమారిలో బయలుదేరి నాగర్‌కోయిల్‌ వైపు ప్రయాణిస్తే 8 కిలోమీటర్ల దూరంలో శుచీంద్రం ఉంది. ఈ ప్రదేశానికి పౌరాణికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా, సాంఘికంగా విశిష్టత ఉంది. ప్రాచీనకాలంలో జ్ఞానవనం, జ్ఞానారణ్యమనే పేర్లతో వాడుకలో ఉన్నది ఈ ప్రదేశమే. అత్రి మహర్షి సతీ అనసూయతో కలిసి నివసించిన ప్రాంతం ఇదే.

త్రిమూర్తులు పసిబిడ్డలైందిక్కడే...
ఇక్కడ ఒక సంవత్సరం అనావృష్టి సంభవించిందట. అనావృష్టికి కారణం గౌతముని శాపం వల్ల కుపితుడైన దేవేంద్రుడేనని అత్రిమహర్షి తెలుసుకున్నాడు. ఇంద్రుని ప్రసన్నం చేసుకోవడానికి హిమాలయాలకు బయలుదేరాడు. అనసూయపై అసూయ చెందిన త్రిమాతలు, ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాల్సిందిగా భర్తలను ఆదేశించారు. త్రిమూర్తులు అనసూయ ఆశ్రమానికి అతిథులుగా వచ్చారు. అతిధి మర్యాదల తర్వాత భోజనం వడ్డిస్తుండగా, నగ్నంగా వడ్డిస్తేనే తింటామని త్రిమూర్తులు షరతు పెడతారు.

అప్పుడు అనసూయ వారిని పసిబిడ్డలుగా మార్చి భోజనం తినిపించింది. అది తెలుసుకుని లక్ష్మి, సరస్వతి, పార్వతి ఆశ్రమానికి పరుగులు పెట్టారు. తన వ్యధవారికి తెలిసేలా చేయాలనుకున్న అనసూయ పసిబిడ్డలు ముగ్గురినీ ఒకే రూపంలోకి మార్చింది. ఎవరి భర్త ఏ బిడ్డ అన్నది తెలియక, లక్ష్మి-శివుణ్ని, పార్వతి-బ్రహ్మను, సరస్వతి-విష్ణువును ఎత్తుకున్నారు. ఇది వారికి కలిగిన మచ్చ. ఆ దోషం ఎలా పోతుందో వారికి అర్థం కాలేదు. ఇంతలో నారదుడు వచ్చి వారిని ప్రజ్ఞా తీర్థానికి తీసుకు పోయి, మూడు వైపులా గుండాలు తవ్వించి హోమం చేయించాడు. ఆ హోమాగ్నిలో ప్రవేశించి వారిని పరిశుద్ధులు కమ్మని ఆదేశించాడు. అలా పరిశుద్ధులైన త్రిమాతలు అనసూయ ఆశ్రమం చేరి పూర్వరూపం పొందిన భర్తలను చేరుకున్నారు.

శిల్పకళానైపుణ్యానికి నెలవు...
శుచీంద్రం ఆలయం వాస్తు శిల్పాలకు నెలవైన అద్భుత కళాఖండం. 134 అడుగుల గోపురం, ముఖద్వారం వద్ద వాహనారూఢులైన లక్ష్మి, పార్వతి, సరస్వతి విగ్రహాలు దర్శనమిస్తాయి. చక్కగా నగిషీలు చెక్కిన తలుపులు, 24 అడుగుల ఎత్తు పైకప్పుతో నాటకశాల మొత్తం చూడడానికే ఒక రోజు కావాలనిపిస్తుంది. ప్రధాన ఆలయం చుట్టూ వరుసగా వందల స్తంభాలుంటాయి. ప్రధాన ద్వారానికి సమీపంలో ఊంజల మంటపం విశాలంగా ఉంటుంది. దాని నాలుగు స్తంభాలకు మన్మధుడు, రతి, అర్జునుడు, కర్ణుడు ప్రతిమలుంటాయి.

Kkmఅక్కడి నుండి తూర్పు వైపుకి తిరిగితే దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది. ముందుకు వెళ్తే వసంత మంటపంలో ప్రవేశిస్తాం. ఆశ్చర్యమేమిటంటే ఎక్కడా చూడని విధంగా నవగ్రహాల విగ్రహాలు మంటపం పై కప్పున ఉంటాయి. ఈ మంటపం మధ్యలో శుచీంద్రస్వామికి, అమ్మవారికి వసంతోత్సవం నిర్వహిస్తారట. ఈ మంటపానికి ఎదురుగా నీలకంఠ వినాయక స్వామి దర్శనమిస్తాడు. వినాయకుని దర్శించుకుని దక్షిణం వైపుగా వెళ్తే కంకాళనాథుడు ఉంటాడు. కంకాళనాథుడంటే పుర్రెలో భిక్షాటన చేసే శివుడు. కంకాళనాథుడిని దర్శించుకోవాలంటే కొన్ని మెట్లు ఎక్కాలి. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. క్రీ.శ 5వ శతాబ్దం నాటి శాసనాలు ఈ ఆలయంలోని రాళ్లపై చెక్కి ఉన్నాయి.

శాసనాలు బ్రాహ్మిలిపిలోనూ, తమిళంలోనూ ఉన్నాయి. ఆలయం నైరుతి దిశలో శ్రీసీతారామలక్ష్మణ విగ్రహాలు ముచ్చటగా కనిపిస్తాయి. ఆ మూర్తులకెదురుగా ముకుళిత హస్తాలతో ఆంజనేయస్వామి ఉంటాడు. 18 అడుగుల ఎత్తున ఈ విగ్ర హం సుందరకాండలో సీతాదేవికి అశోకవనంలో చూపించిన విశ్వరూపానికి ప్రతిరూపగా ఉంటుంది. విదేశీయుల దాడుల నుండి కాపాడడానికి ఈ విగ్రహాన్ని భూమిలో పాతిపెట్టి, 70 సంవత్సరాల క్రితం బయటకు తీశారని ఆలయ నిర్వహకులు చెప్పారు. ఈ విగ్రహానికి వెనుక వైపు చిత్రసభలో ప్రవేశిస్తే మెట్లకు రెండు వైపులా రెండు ఏనుగు ప్రతిమలు, గోడలకు శక్తి, గణపతి, బాలసుబ్రహ్మణ్యం ప్రతిమలు ఆకట్టుకుంటాయి. గర్భగుడిలోని అద్దంలో మనల్ని మనం చూసుకుంటాం. ఇది ఆత్మదర్శనానికినిదర్శనం.

సందేశమిచ్చే శిల్పం...
ఇక్కడి శిల్పాలలో తప్పక చూడాల్సిన శిల్పం ఒకటుంది. ఈ శిల్పంలో ఒక చెవిలో గడ్డిపోచ పెట్టి ఇవతలి చెవిలో నుంచి తీసి పూజారి చూపించినప్పుడు ఆశ్చర్యపోతాం. మరల ఒక గడ్డిపోచను ఒక చెవిలో పెడితే అది లోపలికి వెళ్లిపోయింది. అంటే చెడ్డమాటలు ఈ చెవితో విని ఆ చెవిలో నుండి వదిలివేయాలని మొదటిదానికి అర్థం. మంచి మాటలు విని మనసులోనే నిలుపుకోవాలని రెండవ దానికి అర్థమని అక్కడి వాళ్లు చెబుతుంటే మన శిల్పులనేర్పుకు జోహార్లు చెప్పకుండా ఉండ లేం. ధ్వజ మంటపంలో రెండు ధ్వజస్తంభాలుంటాయి. ఒకటి స్థాణుమలయున కెదురుగా, రెండవదది విష్ణుమూర్తికెదురుగా నిలిచి ఉంటాయి.

శివుడు ఇలా స్థాణువయ్యాడట!...
శుచీంద్రాలయానికి కన్యాకుమారికి సంబంధించిన పూర్వగాధ ఒకటి ఉంది. మహేశ్వరి కన్యాదేవతగా అవతరించినప్పుడు ఆమెను వివాహమాడాలని శివుడు శుచీంద్రానికి వచ్చాడు. బాణాసురుని సంహరించడానికి కన్యా రూపం దాల్చిన పరమేశ్వరి వివాహం చేసుకుంటే రాక్షస సంహారం జరగదని భావిం చిన దేవతలు పెళ్లి చెడగొట్టమని నారదుని పంపించారు.ఎందుకంటే బాణాసురుడు కన్య చేతిలో తప్ప మరేవిధంగా మరణం లేకుండా వరం పొంది ఉన్నాడు. పరమేశ్వరిని ప్రార్థించి శివుని ఒక కోరిక కోరమన్నాడు నారదుడు.

కన్నులు లేని టెంకాయ, గణుపులు లేని చెఱకు గడ, నరాలు లేని తమలపాకులు సూర్యోదయానికి ముందే తెమ్మని శివునికి చెప్పమన్నారు. పరమేశ్వరి అలాగే కోరింది. శివుడు అవి తీసుకుని శుచీంద్రం నుండి బయలు దేరే సమయంలో నారదుడు కోడి రూపంలో కూత వేశాడు. అది విని శివుడు శుచీంద్రంలోనే స్తంభించి స్థాణుమూర్తిగా నిలిచిపోయాడు. శుచీంద్రానికి ప్రతిరోజూ అరమ్‌ వలర్తళ్‌ అనే భక్తురాలు ప్రతిరోజూవచ్చి స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించేది. ఆమె వెల్లాల కులానికి చెందినది. స్వామి ఆమె భక్తికి మెచ్చి పత్నిగా స్వీకరించాడట. అప్పుడు ఆలయంలో అరమ్‌ వలర్తళమ్మ దేవత వెలసిందట. స్వామితో ఆమెకు ప్రతి సంవత్సరం కల్యాణం చేస్తారట. ఆ సమయంలోఆమె వంశీయులు పెళ్లికానుకలతో ఆలయానికివస్తారు.

ఆ పేరు ఇలా వచ్చిందట!...
navaఇదంతా చెప్పాల్సిన అవసరం ఎందుకంటే, ఇంద్రుడు తపస్సు చేశాడని చెప్పే కొండ ‘మరుత్తమల’ ఇక్కడేఉంది. ఇంద్రుడు రథం నిలిపిస ప్రదేశం ‘తేరూరు’. పూజకు ముందు ఇంద్రుడు స్నానం చేయాలనుకున్నాడు. ఐరావతం దంతాలతో తూర్పుకొండల నుండి జ్ఞానవనం వరకు ఒక కాలువను తవ్వింది. ఏనుగు తవ్విననది కావడంతో దీనిని దంత నది అంటారు. శుచీంద్రంలో వరిసాగు, తోటల పెంపకానికి ప్రధాన నీటి వనరు ఈ దంతనదే. ఇంద్రుడు స్నానం చేసి వినాయకుని, నందిని, రావిచెట్టును పూజించి మరుగుతున్ననేతిలో పంచాక్షరీజపం చేస్తూ మునిగాడు. అతని భక్తి మహిమవల్ల సెగకలగలేదు. త్రిమూర్తులు ప్రత్యక్షమై ఇంద్రునికి శాపవిమోచనం ప్రసాదించారు. ఇంద్రుడు శుచియైన ప్రదేశం కాబట్టి దీనికి శుచీంద్రం అనేపేరు వచ్చింది.

ఇంద్రుడు తపస్సు చేసిన మరుత్తమల...
త్రిమూర్తులు అత్రి ఆశ్రమంలో ఉన్నారని నారదుని ద్వారా తెలుసు కున్న ఇంద్రుడు అక్కడకువెళ్లాడు. త్రిమూర్తులు ఇంద్రుని కాపాడడానికి అంగీకరించి ప్రజ్ఞాతీర్థం దక్షిణ దిక్కునగల రావిచెట్టు కింద కూర్చున్నారు. ఇంద్రుని రావిచెట్టు దగ్గరకు వెళ్లకుండా నంది అడ్డుకున్నాడు. ముందుగా కులగురువును పూజించి రమ్మన్నాడు. జ్ఞానారణ్యంలో తూర్పు దిక్కున ఉన్న కొండమీదకు పోయి బృహస్పతిని గురించి తపస్సు చేశాడు. ముందుగా వినాయకుని పూజించి తర్వాత రావిచెట్టును పూజించమని బృహస్పతి చెప్పాడు. రావిచెట్టు కింది భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, పైభాగంలో శివుడు ఉపస్థితులై ఉన్నారు. రావిచెట్టు ముందు ఒక తొట్టిని ఉంచి అందులో మరుగుతున్న నేతిలో పంచాక్షరీ మంత్రం జపిస్తూ 1003 సార్లు మునకలు వేయమని బృహస్పతి ఇంద్రునికి చెప్పాడు.

చేరుకునేదిలా...
కన్యాకుమారి జిల్లాలో చిన్నపట్టణం శుచీంద్రం. ఇది తమిళనాడులోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశం. కన్యాకుమారి నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. కన్యాకుమారికి రవాణా సౌకర్యాలు విరివిగా ఉన్నాయి. సమీప విమానాశ్రయం త్రివేండ్రం. ఇక్కడి నుండి కన్యాకుమారికి 80 కి.మీ. దేశం లోని అన్ని ముఖ్యమైన నగరాల నుండి కన్యాకుమారికి రైలు మార్గాలున్నాయి. ఇక్కడికి 19 కి.మీ. దూరంలో ఉన్న నాగర్‌ కోయిల్‌ స్టేషన్‌లో దిగి కూడా వెళ్లవచ్చు. తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుండి పొరుగు రాష్ట్రాల నుండి కన్యాకుమారికి రోడ్డు మార్గం ఉంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు బస్‌ సర్వీసులు నడుస్తున్నాయి. శుచీంద్రం తర్వాత చూడాల్సిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలజాబితాలో ఎనభై కిలోమీటర్ల దూరంలో త్రివేండ్రం, 91 కి.మీల దూరంలో తిరునల్వేలి, 300 కి.మీ దూరంలో రామేశ్వరం, 242 కి.మీల దూరంలో మధురై ముఖ్యమైనవి.

No comments:

Post a Comment